ఇది జీవధారలు గల నేల (In Telugu)

By Translated by .. original story in English by Vinay NaironMay. 07, 2015in Environment and Ecology

అది ఒకరోజు ఉదయం బాగా ఎండెక్కింది మద్యాన్నం కావస్తుండగా మేము ఆ ప్రాంతంలో నెలకొనివున్న కొన్ని రెండంతస్తుల వాచింగ్ టవర్ల లో ఒక టవర్దగ్గరకు వెళ్లడానికని బయలుదేరాము. మా జీపు కల్పవల్లి కొండలను దాటుకుంటూ ప్రయాణం సాగిస్తుంది. ఆ రోజు ఆకాశం చాలా ప్రకాశవంతంగా వుంది, అది డిశంబరు నెల కావడం వల్ల సూర్యుడు కూడా మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాడు. దేశంలోనే అత్యంత వర్షాభావ ప్రాంతాలలో రెండవదిగా చెప్పబడే అనంతపురం జిల్లాలోని ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి సంవత్సరంలో అనుకూలమైన సమయాల్లో ఇదొకటి. ఆ మధ్యాహ్న సమయంలో ఎత్తైన ఆ టవర్స్ (స్థంబాల) దగ్గరవున్న మైదానం నుండి చూస్తే, ఆ ప్రాంతమంతా పచ్చని గడ్డితో నిండి వుండి, మంచి ప్రకాశవంతంమైన ఆ వెలుగులో అది మరింత సజీవంగా కన్పిస్తుంది. ఒక చల్లని పిల్ల తెమ్మెర ఆ ఆకుపచ్చని పచ్చిక పైనుండి వీయడం ప్రారంభించగా, నెమ్మదిగా సాయంత్రం కావస్తుండడంతో ఆసూర్య కిరణాలకు అది నునులేత బంగారు వన్నెను సంతరించుకొని మరింత అందంగా వుంది. ఆకాశంలో ఏవో ఆకృతులు అందంగా కన్పిస్తున్నాయి. కొంతసేపటి తరువాత నేను నా బైనాక్యులర్ తీసి వాటి ద్వారానూ మరియు సుశిక్షితులైన నా మిత్రులు సిద్ధార్ధ, నరేన్ల సాయంతోనూ అక్కడి ప్రకృతి దృశ్యాలను తిలకించడం ప్రారంభించాను – శీతాకాలపు ఆ పొట్టి పొట్టిగడ్డి దుబ్బుల మధ్య ఒంటరొంటరిగా, జంటలు జంటలుగా ఎండమావుల్లా కదలిపోయే కృష్ణ జింకలు, అంతటి చీకట్లో కూడా నీలికాంతితో దగదగా మెరుస్తున్న తేళ్ళు ఇలా అక్కడ అనేకం ఉన్నాయి. ఆ ప్రకృతి దృశ్యం చూసి, నాలో నేను, ‘ఒక ఛాయాగ్రాహకునికి నిజంగా ఇది ఒక పర్వదినమేకదా’ అనుకొన్నాను.

అక్కడి నుండి నా దృష్టి మరికొన్ని అంశాల మీదికి మళ్ళింది, చుట్టూ చక్కగా అల్లుకొనివున్న గడ్డి దుబ్బులు, భూమిపై పొర్లాడుతున్న రకరకాల జీవరాసులు, లోయ కిరువైపులా రంగురంగుల ఈత చెట్లు ఆహ్లాదకరమైన పశ్చిక బైళ్ళు చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోయింది. ఒక్క అడుగు వెనక్కి వేసి, నా కెమెరా అద్దాలనుకొంచం పెద్దవి చేసి ఆ ప్రాంతం చుట్టూ చూసే సరికి మనం కావాలన్నా తప్పించుకోలేని ఒక పెద్ద ఆకారం నాకంట పడింది. అవి పర్వతం లాంటి ఒక పెద్ద గాలిమర గొట్టాలు (టవర్స్), దాదాపు 70 మీటర్లకు మించి ఎత్తు, 30 మీటర్లకు మించి వ్యాసం గల భారీ రెక్కలతో అది ఆ ప్రక్కనే వున్న కొండ దగ్గర మొదలై ఎక్కడో దూరంగా కనిపించే కొండల వరకూ విస్తరించి వుంది. మేము ఒక దూరంగా ఎత్తైన కొండపై నిలబడివున్నప్పటికీ, అది మా ప్రక్కనే వున్నట్లు అనిపిస్తుంది. అందుకు కారణం అది ఆకారంలో బాగా పెద్దదిగా వుండి ఆ ప్రాంతమంతా విస్తరించడం ఒక్కటే కాదు, ఆపెద్ద పెద్ద రెక్కలతో అది గాలిని కోసుకొంటూ గిరగిరా తిరుగుతుంటే ఆ రాపిడికి వెలువడుతున్న, ముందెన్నడూ వినని ఒక భయంకరమైన శబ్దం కూడా కారణమేనని చెప్పవచ్చు. మరింత పరిశీలనగా చూస్తే, ప్రతీ గాలిమర (విండ్ మిల్) ను చేరుకోవడానికి ఆ కొండలను చీల్చుకొంటూ ఎంతో విశాలమైన రహదార్లు మెలికలు తిరుగుతూ, పైకంటూ వేయబడి వున్నాయి. నిజానికి కల్పవల్లి ప్రాంతవాసులకు, ఈ గాలిమరలతో గతంలో ఎప్పుడూ పరిచయం లేదు, ఇవి ఈ మధ్యనే 2010లో ఇక్కడకు వచ్చాయి. హఠాత్తుగా ఎదురైన ఈ పరిణామాన్ని ఎదుర్కొనడానికి వీరు చాలా గడ్డు పరిస్థితులనే తట్టుకోవలసి వచ్చింది.

The rolling grassy hills of Kalpavalli, with the windmills looming in the distance
1 The rolling grassy hills of Kalpavalli, with the windmills looming in the distance. Photo by Vinay Nair.

కల్పవల్లి చరిత్రను పరిశీలిస్తే, కొంత కాలం క్రితం ఇక్కడ ఒక నాటకీయ పరిణామం సంభవించినట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో ఇదొక నిస్సారమైన రెవిన్యూ బంజరు భూమి కానీ, ఒక వంద లేక అంతకంటే కొంచం ఎక్కువ సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతంలో ఇంచుమించు ఇప్పటిలాగానే చెదురు మదురుగా అడవి వుండేది. దానిలో సుమారుగా 72 రకాల దృఢమైన, కలపనిచ్చే చెట్లు ముఖ్యంగా టేకు మరియు అటువంటి ఇతర జాతుల చెట్లు ఉండేవి. అయితే ఈ కలపను మొదటిగా బ్రిటీషువారు దోపిడీ చేయడం ప్రారంభించారు. వీరు పొడవైన, దృఢమైన దుంగలను అదే పనిగా నరికేసి, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న రైలు పరిశ్రమకు అవసరమైన రకరకాల వస్తు సామాగ్రిని తయారుచేయడం కోసం, ఇక్కడ క్రొత్తగా నిర్మింపబడిన టేకులోడు (టేకును ఎగుమతి చేసే ప్రదేశం) గ్రామానికి తరలించేవారు. ఈ సందర్భంగా టింబక్టు కలెక్టివ్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ బబ్లూ గంగూలీ మాట్లాడుతూ ‘ఆ కాలంలో దోపిడి జరిగినా దానికి కొంత హద్దు ఉండేది, కానీ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాతనే, అదీ అనంతపురం జిల్లాలో క్రొత్త పట్టణాలు అభివృద్ధి చెందడం ప్రారభమైన తరువాతనే అడవి పూర్తిగా నాశనమైంది’ అని అభిప్రాయ పడ్డారు.

ఇక్కడ మిగిలివున్న ఆ కొద్దిపాటి అడవిని తరువాత వివిధ రకాల కలప అవసరాల కోసం విచక్షణా రహితంగా నరికివేయడం వల్ల ఇక్కడ ఉష్ణతాపం క్రమేపీ పెరిగిపోయింది. భారీ స్థాయిలో నేల క్షయానికి గురైనిస్సారమైంది,దాంతో ఇక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది.పైగా, రోజు రోజుకూ వర్షాభావం ఎక్కువై, కల్పవల్లి భూములు పూర్తిగా ఎండిపోయాయి. కనుచూపు మేరలో ఎక్కడా చెట్టు కనిపించకుండా పోయింది. చివరకు ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా, ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకొని నిలబడగలిగే కేవలం కొన్ని గడ్డిజాతి మొక్కలు, అలాగే కొండ బొరియల్లో బ్రతకగలిగిన మూషిక జాతి ప్రాణులు తప్ప ఇక్కడ ఏమీ మిగలలేదు. దాంతో దీన్ని పనికిరాని భూమిగా భావించి ఇటు ప్రభుత్వం అటు ఇతర ఉన్నత వర్గాల ప్రజలు, ఈ ప్రాంతాన్ని బోయ మరియు కురుబ వంటి కొన్ని వెనుకబడిన వర్గాలకు వదిలిపెట్టి తాము బయటికి పోయారు. ఈ వెనుకబడిన వర్గాల ప్రజలు మాత్రం చాలా కాలం దీన్నే నమ్ముకొని వుండడమే కాకుండా, దాదాపు 1970వ సంవత్సరం వరకూ ఈ భూములను వ్యవసాయంతో సహా వివిధ రకాల ఉత్పాధక కార్యకలాపాల కొరకు ఉపయోగించగలిగారు. నిజానికి ఇటువంటి భూముల్లో వ్యవసాయం చేయడమంటే చాలా తెలివి తక్కువ పననే ఎక్కువ మంది భావిస్తారు. వీరు ఇక్కడ సంప్రదాయబద్ధమైన కొన్ని తృణ ధాన్యాలను ముఖ్యంగా వర్షాభావాన్ని, భూమి నిస్సత్తువను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను సహితం తట్టుకొని నిలబడగలిగిన కొన్ని స్థానికరకాల గడ్డి జాతులను పెంచేవారు. ఈ బోయ మరియు కురుబ ప్రజలు చేసే వ్యవసాయం, ఒకరకమైన ప్రకృతి వ్యవసాయమని చెప్పవచ్చు. ఈ విధానంలో,సంవత్సరంలో కొన్ని నెలలు ఈ కుటుంబాలు (ముఖ్యంగా పురుషులు) సాధారణంగా వాతావరణపరంగా గడ్డు పరిస్థితుల్లో ఏకంగా పొలాల్లోనే మకాం ఉండిపోతారు. కొద్దిగా వర్షాలు పడగానే నేలపై చిరుధాన్యాలను చల్లేస్తారు, అవి కొద్ది నెలల్లోనే పంటను చేతికిస్తాయి. ఇక్కడ ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవలసిన అంశం మరొకటి వుంది, వీరెవరూ ఈ భూమిని తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నించలేదు, దీన్ని కేవలం ఒక ఉమ్మడి వనరుగా భావించి, తాము దీనిపై కౌలుదారు హెూదానే అనుభవించేవారు. అందువల్ల ప్రతిఒక్క కుటుంబం, ఇతర కుటుంబాలతో కలసి పనిచేసి, ఆ వచ్చిన పంటలో తన వంతు వాటా తీసుకొనేది. పంట కోసేసిన తరువాత, ఆ భూముల్లోకి తమ పశువులను మేతకు తోలేవారు. పశువులు ఇక్కడ వేసిన పేడలో కొంత భాగాన్ని తీసుకెళ్లి తమ పొలాలకు ఎరువుగా వాడుకొని, మిగిలింది ఇక్కడే వదిలేసేవారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు పేడ ఇక్కడే వుండిపోవడం వల్ల అది మంచి ఎరువుగా మారి, ఈ కల్పవల్లి ప్రాంతాన్ని సారవంతం చేసేది.

అయితే 1970 తరువాత ప్రజలు ఈ భూమిని తమ బ్రతుకు తెరువు కోసం ఉపయోగించుకోవడం ఆపేశారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో భూమి యాజమాన్య హక్కులకు సంబందించి దేశవ్యాప్తంగా చట్టాలలో వచ్చిన భారీ మార్పులు ప్రధానమైన కారణం. గతంలో ఎన్నడూ భూమిని కలిగివుండని అనేక వర్గాలు నేడు వ్యవసాయం నిమిత్తం కొత్తగా భూమిని పొందడం ప్రారంభమైంది. అనంతపురంలోని బహుళ పంటలు పండే ఈ భూమి కేవలం తృణ ధాన్యాలు మాత్రమే పండే కల్పవల్లిలోని భూమితో పోలిస్తే ఎంతో సారవంతమైనదని వీరు భావించడంకూడా ఇందుకు ఒక కారణమే. ఇదే సమయంలో ప్రభుత్వం, వ్యవసాయంలో అధిక రసాయనిక ఎరువుల వినియోగానికి, మార్కెట్టు అవసరాలను తీర్చగలిగే వ్యవసాయ ఉత్పత్తులకు మరియు వాణిజ్య వ్యవసాయానికి అధిక ప్రోత్సాహాన్ని ఇస్తూ, మొత్తం ఆర్ధిక వ్యవస్థను ఆ దిశగానే అభివృద్ధి చేసేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించింది. వీటికి తోడు ప్రజల ఆలోచనలలో కూడా మార్పు వచ్చింది, అంతకంతకూ పెరుగుతున్న ఈ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన వ్యవసాయ పద్ధతులలో మార్పులు తీసుకురావడం అవసరమేమో? అనే ఒక మానసిక స్థితికి ఎక్కువ మంది రావడంతో వ్యవసాయంలో చాలా మార్పు వచ్చింది. అలాగే 1960 చివరి నాటికి ఇక్కడ మొత్తం ఒక తీవ్రమైన ‘కరువు పరిస్థితి’ వ్యాపించి, అది వ్యవసాయంపై గట్టి ప్రభావాన్ని చూపింది. దాంతో చాలా మంది రైతులు తమ బ్రతుకు తెరువుకు వాణిజ్య పంటలే సరైన మార్గమని భావించారు.

90వ దశకానికి ముందు అడవులను ఉమ్మడి యజమాన్యం క్రింద విజయవంతంగా నిర్వహించిన దృష్టాంతాలు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో చాలానే ఉన్నాయి, ఇందుకు బబ్లూయే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రత్యేకించి గ్రామ సర్పంచ్ గ్రామ మండలికి పెద్ద) ఇందులో ఒక కీలక పాత్ర నిర్వహించేవాడు. నిజానికి బబ్లూ దీని నుండే స్ఫూర్తిని పొంది, ఇదే ప్రాంతానికి చెందిన మరియు ఒకవిధంగా బహుముఖ ప్రజ్ఞాశాలియైన1 అక్కులప్పతో కలసి పనిచేయడం ప్రారంభించారు. ఈయన “అనంతపురం పర్యావరణ పరిరక్షణ బృందం” అనే సమూహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించగా, ఇది ఆయా గ్రామాల్లో అటవీ సంరక్షణకు ప్రజలను చైతన్యపరచే కొన్ని గ్రామ కమిటీల ఏర్పాటుకు దోహదపడింది. వీటి ద్వారా ప్రజలకు తెలియజెప్పి ఒప్పించి అటవీ సంరక్షణ దిశగా ప్రజలను కదిలించడానికి దాదాపుగా ఒక సంవత్సరం పాటు నిర్విరామ కృషి చేయాల్సి వచ్చింది. ఫలితంగా 1993 – 94 సంవత్సరం నాటికి కల్పవల్లి ప్రాంతంలో ముష్టికోవిల గ్రామ కమిటీ అధ్వర్యంలో 125 ఎకరాల భూమిలో ‘పచ్చదనం అభివృద్ది’ మరియు ‘నీటి పరీవాహక ప్రాంతంగా కల్పవల్లి పునరుద్ధరణ’ అనే రెండు ముఖ్య లక్ష్యాలతో, అటవీ సంరక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తొలిదశలో దీనికి కోగిర గ్రామ కమిటీ ఇచ్చిన విరాళం చాలా కీలకమైనది. 2008 వ సంవత్సరానికల్లా ఈ ప్రాంతంలోని అటవీ సంరక్షణ కమిటీలన్నీ కలసి కల్పవల్లి వృక్ష పెంపకందార్ల సహకార సంఘంగా రూపొంది, అదే పేరుతో (ది కల్పవల్లి ట్రీ గ్రోయర్స్ కొంఆపరేటివ్) నమోదు (రిజిస్టర్) కూడా కాబడింది. 2011 నాటికి 8 గ్రామాల మీద కలిపి దాదాపుగా 7,000 ఎకరాల భూమి ఈ అటవీ సంరక్షణ కార్యక్రమం క్రిందికి వచ్చింది. బబ్లూ చెప్పినట్లు ఇక్కడపని చాలా నెమ్మదిగా జరిగినా, మొక్కలు నాటడం కాకుండా, స్థానికంగా భూగర్భ జలాలను పెంచగలిగే మరియు నేలకోతను నివారించగలిగే కందకాల త్రవ్వకం, చిన్న తరహా అనకట్టల నిర్మాణాలపైనే ఎక్కువ దృష్టిపెట్టడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతంలో చెలరేగే మంటలను నివారించడానికి వీరు తగిన ఏర్పాట్లను (ఫైర్-లైన్స్) కూడా చేసుకున్నారు. వేసవిలో సంభవించే కార్చిచ్చును అదుపు చేయడానికి అద్దెకు కాపలాదారులను పెట్టుకొన్నారు. ఆ తరువాత ఇక్కడ సహజసిద్ధంగానే విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమైంది. ఆ మొక్కలను పశువులు తినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పనిలో మొత్తం 8 గ్రామాల ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత దీనికి ఉపాధి హామీ పధకం క్రింద ప్రభుత్వం నుండి కొంత నిధులు సమకూరాయి. అయితే చాలా వరకు పని స్వచ్చంద శ్రమ ద్వారానే జరిగింది. ఎందుకంటే ఈ పని వల్ల తమకే ప్రయోజనాలు చేకూరతాయని దీనిలో పాల్గొన్న భాగస్వాములు అందరికీ చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి.

ఫలితంగా నేడు కల్పవల్లి ప్రాంతం ఎన్నో విశిష్ట లక్షణాలతో అలలారుతోంది. ఇక్కడ అడుగు పెట్టగానే విశాలమైన మైదానాల నుండి వివిధ రకాల కొండ శిఖరాల వరకు ఎంతో వైవిధ్యత కనిపిస్తుంది. వీటిలో మొదటిది, సువిశాలమైన పచ్చిక మైదానాలు. ఇది పూర్తిగా రాతి నేల కాకపోవడం వల్ల చాలా వరకూ భూమి పచ్చటి దుప్పటి పరచినట్లు ఉంటుంది. పశుగ్రాసానికి ఇదొక మంచి స్థావరం, ఇక్కడ దాదాపుగా 40,000 నుండి 50,0002 వరకు గొర్రెలకు సరిపడా గడ్డి దొరుకుతుంది. ఆ మధ్యన వరుసగా మూడు సంవత్సరాల పాటు సంభవించిన తీవ్ర కరువు సమయంలో కూడా, ముఖ్యంగా 2003 సం. లో ఈ ప్రాంతంలోని ఇతర గ్రామాల రైతులందరికీతమ పశువులను మేపలేక కబేళాలకు తోలవలసిన దుస్థితి ఏర్పడగా ఈ 8 గ్రామాలవాళ్ళు మాత్రం తమ పశువులకు అవసరమైన గడ్డినంతటిని ఈ కల్పవల్లి ప్రాంతం నుండి సేకరించుకోగలిగారు. అంతేకాకుండా ఆ చుట్టుప్రక్కల 40 గ్రామాలకు గడ్డిని అమ్మ గలిగారు. ఇక్కడి సంప్రదాయబద్దమైన ఇళ్ళకప్పలకు అవసరమైన గడ్డిని కూడా వీరు ఇక్కడి నుండే సేకరించుకొంటారు. రెండవ అంశం, అంత ఎత్తు, లావు ఎదగని చెట్లతో అక్కడక్కడా కనిపించే అటవీ ప్రదేశాలు, బహుశా గతంలో జరిగిన నేల క్షయానికి ఈ చెట్లను గుర్తుగా అనుకోవచ్చు. అయితే వీటిలో ఎక్కువ భాగం వీరు నాటినవే, వంటచెరకు మరియు పశువుల మేతకు రొట్టనిచ్చే చెట్లను వీరు ఎంపిక చేసి మరీ నాటారు. అయితే ఎలాంటి చెట్లు నాటాలి అనేది గతంలో ఇక్కడ ఎలాంటి వృక్ష సముదాయం ఉండేది, వాటివల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను గుర్తుచేసుకొని చెప్ప గల ఆయా గ్రామాల్లోని అనుభవజ్ఞులైన పెద్దల సలహా మేరకు నిర్ణయిస్తారు.

మూడవ అంశం, ఆ కొండల మధ్యన సన్నగా, పొడవుగా ఉండే సుందరమైన లోయలు. ఆ కొండలపైన నీరు నిరంతరంగా ప్రవహిస్తూ, పై నుండి క్రిందికి ధారలుగా జారిపడడం మూలంగా క్రింద వాగులు మరియు సెలయేళ్ళు ఏర్పడి, వాటికి ఇరువైపుల ఏపుగా పెరిగిన ఈత చెట్ల గుంపులు బహు ముచ్చట గొలుపుతూ ఉంటాయి. ఈ చెట్ల నుండి ఇతర ఎన్నో ఉత్పత్తులతో పాటు కల్లు పుష్కలంగా తయారవుతుంది. పైగా ఈ కల్పవల్లి ప్రాంతం ఒక మంచి నీటి పరీవాహక ప్రాంతంగా రూపొందడానికి ఈ వాగులే ముఖ్య కారణం. దీనితోపాటు దాదాపు 400 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తూ, 500 సంవత్సరాలకు పూర్వం3 నుండి ఉనికిలో ఉన్నట్లు చెప్పబడుతున్న ముష్టికోవిల చెరువుకు, తద్వారా జిల్లాలోని ఎన్నో గ్రామాల సుస్థిర బ్రతుకు తెరువుకు ఇవే ఆధారం.

2010 సంవత్సరంలో నిర్వహించబడిన ఒక అధ్యయనంలో కల్పవల్లి పరిసరాల్లో 55 రకాల జాతుల పక్షులు, 28 రకాల వరకు ఉభయచరాలు మరియు సరీసృపాలు మరియు నక్కలు, తోడేళ్లు, చిరుతలు, అరుదైన బూడిద రంగు తోడేళ్లతో4 సహా, 22 రకాల క్షీరదాలు సంచరిస్తున్నట్లు నమోదు చేశారు. ఈ శాంపిల్ ను మరింత నిర్దిష్టంగా ఎంపిక చేసి వున్నట్లయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా. మరో అధ్యయనంలో వివిధ రకాల వృక్ష మరియు గడ్డి జాతులు 324 గుర్తించారు2. మరొక విశేషం ఏమిటంటే ఈ కల్పవల్లి ప్రాంతం రెండు రక్షిత అడవులను కలుపుతూ, వాటి మధ్య (గుట్టూరు రిజర్వు ఫారెస్ట్ మరియు పెనుకొండ రిజర్వు ఫారెస్ట్) ఒక వరండా (కారిడార్) లాగా వుంది. మనుషులు మరియు వన్య ప్రాణుల మధ్య సంఘర్షణలను మరియు రక్షిత ప్రాంతాల్లో జీవ జాతుల వినాశనాన్ని అరికట్టడంలో కారిడార్లు ఎంతో బాగా ఉపయోగపడతాయని విజ్ఞానశాస్త్రం చెబుతుంది.

పైన పేర్కొన్న జీవజాతుల సంఖ్య నిజంగా గణనీయమైనదే. అయితే ఈ విధమైన వృక్ష, జీవజాతులను మరియు మానవ సంతతిని కల్పవల్లి ప్రాంతంలో సుస్థిరం చెయ్యడానికి దాదాపుగా 20 ఏళ్ళ పాటుఒక గట్టి దీక్షతో నిర్విరామ కృషి చేయాల్సివచ్చింది. ఇందులో ఎక్కువ భాగం ఆయా గ్రామాల్లోని ప్రజలే స్వచ్చందంగా చేశారు. ఆవిధంగా వారిని సిద్ధంచేయడానికి, నిర్వాహకులు ముందుగా ఆయా ప్రదేశాల, కుటుంబాల చరిత్రను తెలుసుకొని, వారి సమస్యలను అర్ధం చేసుకొని, ఆపై వారిని ఒప్పించడానికి ఎన్నోసార్లు గంటల కొద్దీ సమయం వారితో గడపాల్సివచ్చేది. బహుశా అది ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో గాలిమరల ఏర్పాటు ప్రతిపాదన ఇక్కడికి వచ్చింది. వీటి గురించి మొదటిసారిగా విన్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ వల్ల ముందుముందు ఏమి జరుగుతుందో తెలియని భయంతో చాలా కుటుంబాలు పొందిన ఇప్పటికీ మరచిపోలేని ఆ దిగ్ర్భాంతిని గురించి తిరిగి బబ్లూ ఒక్కసారి వివరించారు. ప్రాజెక్టు అవసరమైన భూమిని ఇచ్చినట్లయితే, ప్రతిఫలంగా ప్రజలకు పక్కా దేవాలయాలు, రహదార్లు మరియు పాఠశాలలు నిర్మించి ఇవ్వడం తప్ప, అంతకు మించి హామీలేవీ ఈ ప్రాజెక్టు నిర్వాహకులకు కనిపించినట్లు లేదు. టింబక్టు కలెక్టివ్ మరియు వివిధ అటవీ సంరక్షణ కమిటీలు మతపరమైన విషయాలకు దూరంగా ఉండాలని ఒక నియమంగా పెట్టుకొన్నాయి. ఒక్కొక్క గాలిమర (విండ్ మిల్) నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ఒక గుడిని కట్టించడం ఏమంత సమంజసమైన నిర్ణయం కాదు. ఒక సమగ్రమైన సామాజిక, ఆర్ధిక వాతావరణం దృష్ట్యా ప్రతిఒక్క చిన్న అంశం పక్కాగా వుండడం సమాజ ప్రగతికి ఒక చిహ్నమే కావచ్చు, అయితే ప్రధానమైన అంశాలను వరుసగా లెక్కవేస్తే ఇది చిట్ట చివరిది. ఏదిఏమైనప్పటికీ, చాలామంది ప్రజలు ఆరోపించినట్లు ఈ కంపెనీలు,తమకు అవసరమైన అనుమతులను పొందేంత వరకూ, తాము చేపట్టే కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉండబోతాయనే వాస్తవాలు వెల్లడించకుండా, వీరందరినీ తప్పుదారి పట్టించాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి పరిసరాలపై ఈ నిర్మాణాలు చూపే ప్రభావం చిన్నా చితకది ఏమీ కాదు, ఇవి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్నంతా నాశనం చేయగల మహమ్మారి కట్టడాలు.

Blackbuck
3 Blackbuck. Photo by Ashish Kothari
One of the watch towers
4 One of the watch towers. Photo by Vinay Nair.

ఒక్కొక్క గాలిమర(విండ్ మిల్)కు కావలసిన భారీ గొట్టాలు (టవర్స్), వాటికి సంబందించిన జనరేటర్లు నిర్మించడానికి ఒక స్థిరమైన సమతల ప్రదేశం చాలా పెద్ద మొత్తంలో అవసరం కాబట్టి ఈ కొండ శిఖరాలను అవసరమైన మేరకు చెక్కేసి సమతలంగా చేసేశారు. ఎస్. నాగరాజు, కల్పవల్లి వృక్ష పెంపకందార్ల సహాకార సంఘం కార్యదర్శి, ఈ రకమైన ఒక నిర్మాణానికి చాలా ఎక్కువ పరిమాణంలో నీరు అవసరమని, అందుకు దాదాపుగా 15 బోరుబావులు త్రావ్వాల్సి వుంటుందని అంచనా వేశారు. అంతేకాకుండా వీటి నిర్మాణానికి అవసరమైన భారీ యంత్ర పరికరాలను కొండపై కంటూ ఎక్కించడానికి సువిశాలమైన రహదార్లను కొండపై కంటూ నిర్మించాలి. వీటిలో కొన్ని రహదార్లు 60 మీటర్లకు మించి వెడల్పు కలిగివున్నాయి (రావు & శ్రీనివాసన్, 2013), వీటికోసం కొండ ముఖభాగాన్ని నిటారుగా సుమారు 25 అడుగుల వెడల్పుతో ఏటవాలుగా చేక్కెయ్యడం వల్ల ఇక్కడ మేతమేసే పశువులు, గొర్రెలు దాన్ని దాటుకొని ముందుకు వెళ్లడానికి సాధ్యం కావడం లేదు, కొన్ని సార్లు అలా ప్రయత్నించిన పశువులు తరచూ జారిపడి చచ్చిపోతున్నాయి. బబ్లూ చెప్పినట్లు, ఈ కొండలపైన ఉండే జలధారలు సహజసిద్ధంగా ప్రవహిస్తూ, ముందుగా లోయల్లోకి మరియు వాగుల్లోకి అక్కడి నుండి చివరకు ముష్టికోవిల చెరువులోకి చేరుతాయి. ఈ రహదార్లు వీటిని ఎక్కడైతే ఖండిస్తున్నాయో, ప్రధానంగా ఆ ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి, మరీ ముఖ్యంగా సహజసిద్ధమైన ఈ నీటి ప్రవాహ దిశ మారిపోవడం వల్ల మైదాన ప్రాంతంలోని గ్రామాలకు ఇంతవరకూ ఒక ఆయకట్టుగా పనిచేస్తూ వచ్చిన కల్పవల్లి విధి విధానం పూర్తిగా దెబ్బతింటుంది. తద్వారా ఇతర అనేక అంశాలతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రధాన జీవనాధార పంటయైన వరిసాగు బాగా దెబ్బతింటుంది. ప్రస్తుతం కల్పవల్లి లోపల 47 గాలిమరలు(విండ్ మిల్స్) ఉండగా, మరో 10 ప్రతిపాధనలో వున్నాయి. ప్రస్తుతానికి గ్రీన్ ట్రిబ్యునల్ అదనపు నిర్మాణాలేవీ ఇక్కడ చేపట్టరాదని తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసింది, కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది.

The winding access roads cut into the hills alters water drainage over the landscape
5 The winding access roads cut into the hills alters water drainage over the landscape.
Steep inclines of a hill side cut by access roads, un-scalable by grazing animals.
6 Steep inclines of a hill side cut by access roads, un-scalable by grazing animals.

తరచూ కాకపోయినా కొన్ని సంఘటనలు, అంతవరకూ మనకున్న అభిప్రాయాలను, నమ్మకాలను పూర్తిగా చెదర గొడతాయి. నిజానికి కల్పవల్లి సందర్శన నాకు అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. పవన మరియు సౌరశక్తులు విద్యుదుత్పత్తి విధానాన్ని మొత్తాన్ని సమూలంగా మార్చగలిగిన మరియు మానవాళి అపరిమిత ఇందనశక్తి అవసరాలన్నింటిని తీర్చగలిగిన నిజమైన ప్రత్యామ్నాయాలని ఇంతవరకూ ఎంతో ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. ఈ గాలిమరలు ఇక్కడి కొండల జీవనాడులను నిలువునా క్రుంగదీశాయి. దీన్ని బట్టి చూస్తే ఇవి మనం అమలుచేయదగిన ఏమంత గొప్ప ప్రత్యామ్నాయ పద్దతులైతే కావని, వీటి పరిమాణం చాలా కీలకమని అనిపిస్తుంది. ఒకవేళ పవన విద్యుదుత్పత్తి (గాలిమరలు) ఒక మంచి ప్రత్యామ్నాయ పద్దతి అయితే అయ్యివుండవచ్చు, కానీ మనం ఇక్కడ ‘ఎవరి ఉపయోగం కోసం మరియు ఎవరి ప్రయోజనం కోసం దీన్ని ఉత్పత్తి చేస్తున్నాం?’ అన్న ప్రశ్నలను పరిగణలోనికి తీసుకోవడం చాలా ముఖ్యం, అలాగే బహుశా ఒక సమాజంగా మనం అంతిమంగా “మనం ఎంత శక్తిని ఉపయోగించుకుంటాము?” అనేది కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం ఈ కల్పవల్లిలో విద్యుదుత్పత్తి మొత్తం మహారాష్ట్రకు అమ్మడం కోసమే ఉత్పత్తి అవుతుంది. మనం ఇంతవరకూ ప్రత్యామ్నాయం అన్న పదాన్ని సొంతం చేసుకోలేకపోయామని కూడా గ్రహించగలగాలి. మనం ఎంతసేపూ సెల్సియస్ డిగ్రీల్లో పెరుగుతున్న ఉద్గారాల మరియు మండుతున్న భూగోళం (గ్లోబల్ వార్మింగ్) అంటూ ఏవో కొన్ని ఊకదంపుడు పదాల గురించే మాట్లాడుతున్నాం. వాస్తవ ప్రపంచంలోని విభిన్న సంక్లిష్టతల గురించి మాత్రం పూర్తిగా వదిలిపెట్టేశాము.. సమతౌల్యతా భావన పూర్తిగా పాడైపోయింది, ప్రకృతి సిద్ధమైన ఒక అడవిని, కేవలం మొక్కల పెంపకం ద్వారా తిరిగి భర్తీ చేయడమనేది ఎంతమాత్రం సాధ్యమయ్యే పని కాదు, దీని ద్వారా కర్బన ఉద్గారాల భర్తీ కూడా సాధ్యం కాదు. ఏదైనా ఒక ప్రదేశంలో ఒక చిన్న పవన శక్తి సాధనాన్ని (విండ్ ఫార్మ్) ఏర్పాటు చేయడం, దానికి వందల రెట్లు భారీ పరిమాణంలో వుండే గాలిమరల ను నెలకొల్పడం ఒక్కటి కాదని గుర్తించాలి.

కల్పవల్లి ఇప్పటికీ చక్కగా వర్ధిల్లుతూ, నిరంతరంగా పరివర్తన చెందుతూ వుండే ఒక సుందర ప్రదేశం. అయితే ఈ పరివర్తన ఆశాశ్వతమని, అది ఆయా ఋతువులు, అక్కడ కనిపించే రంగురంగులగడ్డి మైదానాలు, వాటిలో గుంపులు గుంపులుగా మేత మేసే పశుపక్ష్యాదులు వంటి అంశాలపై ఆధారపడి మారుతూవుంటుందని ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు.

కృతజ్ఞతలు:

* డిశంబర్ 2014 లో కల్పవల్లి పర్యావరణంపై ఒక వర్క్ షాప్ (కార్యశాల)ను నిర్వహించిన అడవి ట్రస్ట్ కు చెందిన సిద్ధార్ధ రావు మరియు నరేన్ శ్రీనివాసన్ లకు నేను తప్పక కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

నేను అడిగిన అనేక ‘ఎన్.జి.ఒ. మాదిరి’ ప్రశ్నలకు ఎంతమాత్రం విసుక్కోక, ఓపికతో సమాధానాలు చెప్పిన కల్పవల్లి వృక్ష పెంపకందార్ల సహకార సంఘ సభ్యులు మరియు కార్యదర్శులకు కూడా ఎంతగానో కృతజ్ఞుడనై ఉంటాను.

చివరిగా, నాకు వీడ్కోలు పలుకుతూ ఎంతో ఆప్యాయతతో ఆ రోజు రాత్రి తమ ఇంటిలో పసందైన విందును అందించిన బబ్లూ మరియు మేరీలకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను.

స్వేచ్చానువాదం: ఎల్. మల్లిక్, విశాఖపట్నం

  1. టింబక్టు కలెక్టివ్(2012) http://www.goodnewsindia.com/index.php/magazine/story/timbaktu/p5/P4/ వెబ్ సైట్ నుండి గ్రహించబడింది.
  2. లీనా, ఎమ్. (2012) https://cdn.cseindia.org/userfiles/kalpavalli.pdf వెబ్ సైట్ నుండి గ్రహించబడింది.
  3. లెనిన్, జె. (2015) https://www.thehindubusinessline.com/blink/cover/Making-a-pig%E2%80%99s-ear-of-it/article20874649.ece వెబ్ సైట్ నుండి గ్రహించబడింది.
  4. రావు,ఎస్. &శ్రీనివాసన్, ఎన్. (2013); ఆన్ ఒయాసిస్ ఆఫ్ లైఫ్. అముద్రిత నివేదిక

Read original story The soil has Veins in English

Story Tags: , , , ,

Leave a Reply

Loading...